భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జనసేన ర్యాలీ

*భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జనసేన ర్యాలీ*

*రికార్డుల మంత్రి అనిల్ గారు ముందు మీ శాఖను చక్కదిద్దండి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడొచ్చు: కేతంరెడ్డి వినోద్ రెడ్డి*

రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న “లాంగ్ మార్చ్”కు మద్దతుగా నెల్లూరు నగరంలో జనసేన పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్ధి కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కనకమహల్ సెంటర్ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి వందలాది మంది కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులతో ప్రారంభమయిన ర్యాలీ గాంధీబొమ్మ సెంటర్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నేడు ఇసుక పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వలన రాష్ట్రంలో అనేకమంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భవన నిర్మాణాలు వాయిదాలు పడి అనుబంధ రంగాలన్ని కుదేలయ్యాయని తెలిపారు. పూట గడవని పరిస్థితుల్లో అనేకమంది కార్మికులు అప్పుల పాలవుతున్నారని, పనులు లేక ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు సైతం రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని మంత్రులు చెబుతున్నారని, వరదలకు ముందు రెండు నెలల పాటు నూతన పాలసీ అంటూ కాలాన్ని తాత్సారం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నూతన పాలసీ ఏమైనా పారదర్శకంగా ఉందా అంటే ఇసుక ధర పెరగడమే కాకుండా మీసేవ స్లాట్ రిజిస్ట్రేషన్ల ద్వారా భారీ అక్రమాలు జరుగుతూ ఇసుక రాష్ట్రాలు దాటి తరలిపోతూ పెద్ద మాఫియాలా తయారైంది అని దుయ్యబట్టారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కార్మికులకు మద్దతుగా పోరాటం జరుపుతుంటే అనిల్ కుమార్ యాదవ్ గారు వంటి మంత్రులు తాము చక్కబెట్టాల్సిన పనులు చక్కబెట్టకుండా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయడం తగదని తెలియజేశారు. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రాజెక్టులు నిండుతుంటే అది తమ ఘనత, రికార్డు అంటూ భజన చేసుకుంటున్నారని, కండలేరు డ్యామ్ నిర్మాణం అయిన నాటి నుండి చరిత్రలో కండలేరు నిండకుండా సోమశిల డ్యామ్ గేట్లు ఎత్తింది లేదని, అలాంటి ఘనమైన చెత్త రికార్డు కూడా మంత్రి అనిల్ గారిదే అని దుయ్యబట్టారు. వరదలు పోటెత్తినా కూడా కొన్ని ప్రాజెక్టులు ఎందుకు నిండలేదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ గారు ప్రశ్నించారని, గ్రామాలను, పట్టణాలను ముంచకుండా ప్రాజెక్టులను ఎలా నింపాలి అనే దానిపై మంత్రి గారు దృష్టి పెట్టాలని, తర్వాత తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై దృష్టి పెట్టొచ్చు అని హితవు పలికారు. తమ ప్రభుత్వ తప్పులను పవన్ కళ్యాణ్ గారు బహిర్గతం చేస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోక టీడీపీ దత్తపుత్రుడు, సరైన స్రీన్ ప్లే, స్క్రిప్ట్ లేదంటూ మంత్రి వ్యంగ్యంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్రంలో ఒక ప్రక్క బీజేపీ వారు తమ అసమర్ధత గురించి దుమ్మెత్తి పోస్తున్నా కనీసం వారి పేరు తలవడానికి కూడా భయపడుతున్నారని, బీజేపీ పై మాట్లాడేందుకు స్క్రిప్ట్, స్లిప్పులు మంత్రి గారికి ఇంకా అందలేదా అని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దత్త పుత్రుల్లా వ్యవహరిస్తున్నారని, అక్కడాయన ఆర్టీసీ కార్మికుల విషయంలో కఠినంగా ఉంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న వీరు ఇక్కడ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు భవన నిర్మాణ కార్మికుల విషయంలో వ్యవహరిస్తున్నారన్నారు. నష్టపోయిన కాలానికి నెలకు 10 వేల చొప్పున కార్మికులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, ఉడాలి సూర్యనారాయణ, ఆలియా, శిరీష, అంచల సారథి, కార్తీక్, మోష, మజహర్, బాలకృష్ణ, చందు, రాఘవ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ketham reddy vinod reddy

“In the path of Congress ,with a vision of Youth Congress. A long journey where i get active everyday instead of tiring.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *