వాలంటీర్లను వెట్టి చాకిరీ కోసం నియమించుకున్నారా?

గ్రామ సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను వెట్టి చాకిరీ కోసం నియమించుకున్నారా?

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ ఉద్యోగులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వరా?
-జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి
——————————–
జనసేన పార్టీ నెల్లూరు నగర కార్యాలయంలో నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నేడు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల పట్ల జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించిన తీరుని ఖండించారు. నెల్లూరు నగరంలో 60 కోట్లకు పైగా వెచ్చించి మైక్రో వ్యవస్థగా సచివాలయ వ్యవస్థను రూపొందిస్తే ఆ ఉద్యోగులు సరిగ్గా విధులు నిర్వహించడం లేదంటూ మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ పారిశుద్ధ్య కార్మికులతో వారిని పోల్చుతూ మాట్లాడడం మంత్రి స్థాయికి తగదని తెలిపారు. ప్రభుత్వం దృష్టిలో గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వెట్టి చాకిరీ చేసే బానిసలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పరంగా ఏ లోపం జరిగినా గ్రామ సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను బూచిగా చూపుతున్నారని, శాఖాపరమైన అధికారుల ప్రస్తావన, అధికారుల అలసత్వం ప్రస్తావనకు రావట్లేదని, ఇది మంచి పరిమాణం కాదని ఆయన తెలిపారు. నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాలు, ఇతర శాఖలకు సంబంధించిన అన్ని కార్యాలయాలు ఉన్నాయని కానీ నేడు ప్రజలు అన్ని సేవల కోసం గ్రామ సచివాలయాలకే వెళ్లాలనే ఓ నూతన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని, దీని కారణంగా ఈ ఉద్యోగులకు ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉందని ఆయన తెలియజేశారు. ఏదైనా ప్రభుత్వ సేవకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే హక్కు ఈ ఉద్యోగులకు ఉందా అంటే అది కూడా లేదని వీరు కేవలం పరిశీలన చేసి సంబంధిత శాఖలకు దస్త్రాలను పంపే వారు మాత్రమేనని తుది నిర్ణయం సంబంధిత కార్యాలయాల్లోని అధికారులే తీసుకోవాలని, ఆయా కార్యాలయాల్లో ఆలస్యం జరిగినా దానికి సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను బాధ్యులను చేసి దుర్భాషలాడడం తగదని హితవు పలికారు.

ఇది పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగం అంటూ రెండేళ్ల పాటు ఎలాంటి బెనిఫిట్స్ రావు, నెలకు 15వేల రూపాయల జీతానికి పని చేసేలా సచివాలయ ఉద్యోగులను నియమించుకున్నారని, కొందరైతే 70వేలు, 80వేలు రూపాయలు జీతాలు పొందే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను సైతం వదిలేసి ప్రభుత్వ ఉద్యోగం అంటూ చేరారని కానీ నేడు కొందరు అధికారులు ఈ ఉద్యోగులకు కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వట్లేదని తెలిపారు. నిర్ణీత సమయంలో ధరఖాస్తులను ఫార్వార్డ్ చేసి పూర్తి చేయాల్సి ఉండడంతో వీరు రోజుకు 8 గంటలకు మించి పని చేస్తున్నారని, అయినా మంత్రుల నుండి, ఎమ్మెల్యేల నుండి, ఉన్నతాధికారుల నుండి సరైన గౌరవం లేక చీదరింపులు ఎదుర్కుంటున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఇక వాలంటీర్ల వ్యథలు అయితే వర్ణనాతీతం అని ఆయన అన్నారు. ఎటువంటి ఉన్నత చదువులు చదువుకోకూడదు, ఇంకెక్కడా ఏం పని చేయకూడదు అంటూ భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 కు తూట్లు పొడిచేలా అనేక అడ్డగోలు షరతులు విధించి కేవలం 5వేల రూపాయల జీతానికి వాలంటీర్లను నియమించుకున్నారని, వీరిని కనీస స్థాయి గౌరవంతో కూడా కొందరు అధికారులు చూడట్లేదని, పైపెచ్చు ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు ఏమైనా కోల్పోతే వాలంటీర్లే బలవుతున్నారని, అధికారులు తప్పించుకుంటున్నారని అన్నారు. నగరంలోని ఒక్కో డివిజన్ లో 50 మందికి పైగా వాలంటీర్లను నియమించారని, వీరు ప్రభుత్వ పరంగానే కాకుండా వైసీపీ పార్టీ ఇన్ ఛార్జ్ ల చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి దారుణమైన దాపురించిందని ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ తిరుగుతూ అవసరం ఉన్న మేరకు ప్రజా ధరఖాస్తులను తీసుకోవాల్సిన వాలంటీర్లకు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు ఎందుకని ఆయన ప్రశ్నించారు. వీరిని నియమించుకున్న విధానం, అవసరం మేరకే కాకుండా గొడ్డు చాకిరీకి అధికారులు ఉపయోగించుకుంటున్నారని, వాలంటీరు వైసీపీ కార్యకర్త అయితే వెసులుబాటు ఉంటోందని, పొట్టకూటి కోసం చేరిన అనేకమంది ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన తెలిపారు.

నగరంలో అనేక మంది రేషన్ కార్డులను తొలగించారని, పెన్షన్లు తొలగించారని దీనికి ప్రభుత్వం పై స్థాయిలో కసరత్తు జరిపి తొలగించి, ఆ నెపాన్ని నేడు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల మీదకు నెట్టేస్తున్నారని, ఈ కొట్టేసిన రేషన్ కార్డులు, పింఛన్ల కోసం ప్రజలు అన్ని కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. 50 ఇళ్ళకు ఓ వాలంటీర్ అంటూ నియమించారని, కానీ నేడు ప్రజలు అనేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారంటే ఇది పూర్తి స్థాయి ప్రభుత్వ విధాన వైఫల్యం కాదా అని కేతంరెడ్డి ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, శిరీషా రెడ్డి, షేక్ ఆలియా, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment